Thursday, June 24, 2010

ఋతువులు...

'వసంత' ఋతువులో ,
గున్నమామిడి చెట్టు క్రింద గోరుముద్దలు తింటూ,
గోదావరి గట్టు మీద కోయిలమ్మ పాట వింటూ...
నీ మధుర గానం అలా  ఉంటుంది అనుకుంటూ......'గ్రీష్మం' వరకు గడిపా....

'గ్రీష్మ' ఋతువు లో ,
వడగాలుల వేడి వేడి నిట్టూర్పులు వింటూ..
తాటిముంజేలు తింటూ,జడ లో మల్లెలు తురుముకుంటూ...
నీ మనసు ఇలా స్వచంగా ఉంటుంది అనుకుంటూ..............'వర్షా' కాలం వరకు ఎదురుచుసా....

'వర్ష' ఋతువు లో,
వానల్లో తడుస్తూ,ఏటిగట్టు వెంట పరిగెడుతూ,
పిల్లకాలువల్లో ఈతకొడుతూ,సెలయేరు లో ఆడుతూ,
నీ చిలిపి అల్లరి ఇలాగే ఉంటుంది అనుకుంటూ.........'శరత్' కాలం వరకు వేచా...

'శరత్' ఋతువు లో,
విరబూసిన వెన్నెల్లో ఆడుకుంటూ..
నిర్మలమైన ఆకాశాలను తేరిపారా చూస్తూ,
నీవు ఇలాగే ప్రశాంతంగా,నిష్కల్మషంగా ఉంటావనుకుంటూ......'హేమంతం' దాకా గడిపా...

'హేమంత' ఋతువు లో,
పిల్లగాలుల సన్నాయి  స్వరాలూ వింటూ,
రాలిన పూల పరిమళాల జ్ఞాపకాలు తలుచుకుంటూ,
నీ దరహాస వీచిక ఇంత హాయిగా ఉంటుంది అనుకుంటూ.......'శిశిరం' వరకు చూసా...

' శిశిర' ఋతువు లో,
నీవు ఇక రావని అనుకుంటూ,
మోడువారబోయే నా జీవితాన్ని తలుచుకుంటూ,
నీ హృదయం ఇంత ఘనీభవిన్చిందా  అని అనుకుంటూ......లోకం నుండి సెలవు తీసుకుంటుంటే...

తొలిమంచు తెరలను తొలగించుకుని.....నీవు....'చైత్రంగా' వచ్చావు..


నా మదిలో పులకల మొలకలు పోడిపించావు...
విరిబాలల తేనెల సిరులు కురిపించావు...
నీవు వచ్చావు....నన్ను వలచావు....


-ఇందు 

No comments:

Post a Comment